దేవుడు నీలోనే ఉన్నాడు - కథ - Online Pujalu - ఆన్లైన్ పూజలు

19, సెప్టెంబర్ 2020, శనివారం

దేవుడు నీలోనే ఉన్నాడు - కథ"మానవుడు దేనినయితే వెతుకుతున్నాడో అది అతనికి అతి సమీపంలోనే ఉంది. అయినా అతను దానిని అక్కడా ఇక్కడా వెతుకుతుంటాడు."


ఒక చిన్న కథ రూపంలో ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస వివరించారు.


ఒకడు చుట్టకాల్చాలనుకున్నాడు, నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు, అది అర్థరాత్రి అవడం వలన అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, అతను ముందు వాళ్లని పిలిచాడు, తరవాత తలుపు తట్టాడు, ఎవరూ పలకలేదు, తరవాత తలుపుని గట్టిగా బాదటం మొదలుపెట్టాడు.

ఆ శబ్దానికి లేచి లోపలనుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూచారు. ఎదురుగా ఈ మనిషి కనబడ్డాడు. అతన్ని చూడటంతోనే 'ఏమిటండీ, సంగతేమిటి? ఇంత రాత్రి వేళ ఇలా వచ్చారు?' అని ప్రశ్నించారు.  

ఆ ధూమపాన ప్రియుడు వెంటనే, 'ఆ మాత్రం ఊహించలేవటయ్యా! చుట్ట కాల్చటమంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా? అందుకే చుట్ట వెలిగించుకోవటానికి నిప్పు అడుగుదామని వచ్చానూ అని బదులు చెప్పాడు.


అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ, 'మీరు భలే వారండి! దీని కోసమేనా ప్రయాసపడి ఈ అర్థరాత్రి ఇంతదూరం వచ్చి తలుపు బాదుతూ ఉన్నారు? వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా!' అన్నాడు.


నీతి:


దేవుడు అక్కడ ఎక్కడో దూరంలో ఉన్నాడని తలుస్తున్నంత వరకు మానవుడు అజ్ణానంలో ఉంటాడు. భగవంతుడు తనలోనే ఉన్నాడని తెలుసుకున్నపుడు ఝ్నాని అవుతాడు."