కార్తీక మాసం విశిష్టత - Online Pujalu - ఆన్లైన్ పూజలు

29, అక్టోబర్ 2020, గురువారం

కార్తీక మాసం విశిష్టత


న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగమ్,

న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.


అర్థం:


కార్తీక మాసానికి సమానమయిన మాసం లేదు, కృత యుగానికి సమానమయిన యుగం లేదు, వేదాలకి సమానమయిన శాస్త్రం వేరే లేదు, గంగానదికి సమానమయిన నది లేదు.


కార్తీక మాసం విశిష్టత:


పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రం లో ఉండే మాసాన్ని కార్తీక మాసం గా పిలుస్తారు, కార్తీక మాసము శివుడు, విష్ణువు లకి ప్రీతిపాత్రమయిన , చాలా పవిత్రమయిన మాసం, తెలుగు సంవత్సరం ప్రకారం ఇది ఎనమిదవ మాసం.


కార్తీక మాసం శివుడు, విష్ణువు పూజలకి చాలా పవిత్ర మయిన మాసం. కార్తీక స్నానాలు, కార్తీక సోమవార వ్రతాలు, ఉపవాసాలు, కార్తీక దీపాలు, ఆకాశ దీపాలు, వన భోజనాలు కార్తీక మాస విశిష్టతలు.


చాలా మంది ఉపవాసం ఉండి పూజ అభిషేకాలు చేసుకుని , నక్షత్ర దర్శనం తరవాత గుడిలో కాని, ఇంటిలో తులసి దగ్గర కాని దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.


అలాగే రోజుకొక అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని ఈ మాసం లో పారాయణం చేస్తారు.


కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షలు మొదలయి, మకర సంక్రాంతి వరకు కొనసాగుతాయి.


కార్తీక మాసం లో వచ్చే పండుగలు:


భగినీ హస్త భోజనం

నాగుల చవితి

నాగుల పంచమి

ఉత్థాన ఏకాదశి

వైకుంఠ చతుర్ధశి

కార్తీక పౌర్ణమి

క్షీరాబ్ధి ద్వాదశి


కార్తీక సోమవారం:


కార్తీక సోమవారం శివ, కేశవులకి ఇద్దరికి చాలా ఇష్టమయినది, ఈ పవిత్రమయిన రోజున ఉపవాసం ఉండి, పూజ అభిషేకాలు చేసి దాన ధర్మాలను ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.


ఒకవేళ మీకు దగ్గరలో గుడి లేకపోతే రావిచెట్టు మొదట్లో కాని, తులసివనం దగ్గర కాని భగవంతుడిని స్మరించుకోవచ్చు.


కార్తీక సోమవార వ్రతాన్ని ఉపవాసం లేదా ఏకభుక్తం లేదా నక్తం లేదా అయాచితం పద్దతిలో చేసుకోవచ్చు.


ఉపవాసం:


కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి పూజాది కార్యక్రమాలు చేసుకుని, సాయంకాలమ్ అభిషేకాలు అయ్యాక నక్షత్ర దర్శనం తరవాత తీర్థ ప్రసాదాలను స్వీకరించటం.


ఏకభుక్తం:


కార్తీక సోమవారం నాడు పూజాది కార్యక్రమాలు చేసుకుని పగలు భోజనం చేసి, రాత్రి పూజ అభిషేకాల తరవాత నక్షత్ర దర్శనం తరవాత రాత్రి తీర్థ ప్రసాదాలు మాత్రమే స్వీకరించటం.


నక్తం:


కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి పూజాది కార్యక్రమాలు చేసుకుని, రాత్రి పూజ అభిషేకాల తరవాత నక్షత్ర దర్శనం తరవాత భోజనం కాని అల్పాహారం కాని తీసుకోవచ్చు.


అయాచితం:


కార్తీక సోమవారం నాడు పూజ అభిషేకాలు చేసుకుని, తమంతట తాముగా భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరయినా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం.


ఒకవేళ పైన చెప్పినవి కుదరక పోయినా, వారి వారి పరిస్థితులని బట్టి పూజ, జపం, అభిషేకాలని చేసుకోవచ్చు.


కార్తీక మాస దీపారాధన:


పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం రావటం వలన కార్తీక మాసం అన్న పేరు వచ్చిందని చెప్పుకున్నాం కదా, కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమయిన నక్షత్రం , కార్తీక మాసం చలికాలం లో వస్తుంది, చలి ద్వారా ప్రబలే వ్యాధులని దీపం ద్వారా వచ్చే పొగ అడ్డుకుంటుంది అనేది పెద్దల మాట.


అందుకే కార్తీక మాసం లో గుడుల్లో, ఇంటి ముందు వాకిలి దగ్గర దీపలని వెలిగించి పెడతారు.


ఎవరయినా, ఏదయినా కారణం వలన దీపారాధన చేయని వాళ్లు కూడా కార్తీక పౌర్ణమి రోజున వత్తులు వెలిగించటం వలన ఏడాది పొడవునా దీపారాధన చేసిన దానితో సమానం.


ఆకాశ దీప విశిష్టత:


కార్తీక శుద్ద పాడ్యమి నుండి పితృ దేవతలు ఆకాశ మార్గాన తమ లోకాలకు పయనిస్తారని , వారికి కనిపించేలా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణం చెపుతుంది.


అందుకే, కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్థంభానికి ఆకాశ దీపాన్ని వేలాడ దీస్తారు.


ఆకాశ దీపాన్ని వెలిగించేప్పుడు  దామోదర మావాహయామి అని కాని త్రయంబక మావాహయామి అని కాని చదువుతు వెలిగిస్తారు.


కార్తీక వనభోజనాలు:


సంవత్సరం లో ఒకరోజు ప్రాపంచిక విషయాలనుండీ దూరంగా సన్యాసాశ్రమం లో గడపడానికి కార్తీక వనభోజనాలకి వెళతారు.